You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

02 February 2009

చంద్రబాబు పై నా వ్యాఖ్యల వివరణ

నేను మొన్న రాసిన పోస్టునకు ఏకాంతపు దిలీప్ స్పందనని స్వాగతిస్తూ నేను రాసిన నా అభిప్రాయాల వెనుక ఉన్న కారణాలు వివరిస్తూ రాస్తున్న పోస్టు.


@ చంద్రబాబు వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధార పడుతున్నారు, అంత మంది ఆధార పడవలసిన అవసరం లేదు, ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసిన సమయం వచ్చింది అనే స్పూర్తితో వ్యవహరించాడు కానీ, వ్యవసాయం దండగ అనే స్పూర్తితో కాదు.

మీరు చెప్పినట్లు చంద్రబాబు, వ్యవసాయం మీద అంత మంది ఆధారపడం అవసరం లేదు అన్నట్లు నాకు గుర్తులేదు. అలాగే అనుకున్నా కూడా అది చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్సనం అవుతుంది. ప్రపంచంలోనే ఎంతో నాణ్యమయిన భూములలో మనవి ఒకటి. అటువంటి భూముల ఉత్పాదకత పెంచే చర్యలు తీసుకుని రాష్ట్రానికి, తద్వారా దేశానికి "ఆహార భద్రత" కల్పించవలసిన భాద్యత మన నాయకులపైన ఉంది. మీరు గమనించారో లేదో. (చైనా వాడు తమ దేశంలో పండించుకోవడానికి మంచి భూములో లేక అమెజాన్ అటవీ ప్రాంతాన్ని తమ దేశానికి అద్దెకి ఇస్తారేమో అని బ్రజిల్ దేశాన్ని అడిగాడు).

మన దేశంలో ఉన్న జనాభాకి ఎంత మంది వ్యవసాయం వీడి వెళ్ళినా ఇంక మెజారిటీ జనం దాని మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది ఏదో "సిగ్గుచేటు" అయిన విషయంగా భావించరాదు. అంతెందుకు గత కొన్నేళ్ళుగా వర్షాలు పడి మంచి దిగుబడి వస్తేనే ఇంకా ఆహార ధాన్యాల కొరత బాగా ఉంది. పూర్తిగా బియ్యం ఎగుమతులను ఆపివేసాం. ఎన్నడూ లేని విధంగా గోధుమలు దిగుమతి చేసుకుంటున్నాం(దీనికి బాబు కారణం అనట్లేదందో). ఈ దశాబ్ద ఆరంభంలో ఉన్న విధంగా కరువు ఉండి ఉంటే మన పరిస్థితి ఆలోచించగలరు.

రానున్న కాలంలో "ఆహార భద్రత" లేని దేశం, అదీ మన వంద కోట్ల పైగా జనాభా ఉన్న దేశం నిలదొక్కుకోవడం ఎంత కష్టం ? ప్రత్యామ్నాలు వెతుక్కోవలసిన స్ఫూర్తితో వ్యవహరించేవాడు ఆ ప్రత్యామ్నాలు చూపాల లేదా ? చూపలేదు సరి కదా ఉన్న వ్యవస్థలను పటిష్టం చేయలేకపోయాడు. ఒక వేళ చూపాడు అని మీరు అంటే నేను తెలుసుకోగోరుచున్నాను !

వృధాగా సముద్రంలోకి పోతున్న కొన్ని వందల టియంసి ల గోదావరి జలాలను ఏమి చేయలేక చూస్తూ కూర్చున్న మహోన్నత వ్యక్తీ చంద్రబాబు (అంటే అప్పుడప్పుడూ అక్కడక్కడ సంకుస్తాపణలు చేసడనుకోండి . కాని అది వేరే విషయం కదా!!)

@ పనికి ఆహారం కింద ఎన్ని టన్నుల బియ్యం వచ్చింది? ఎంత పక్క దారి పట్టింది? ఆ పక్క దారి పట్టింది మన రాష్ట్ర మొత్తం ఉత్పత్తితో పోల్చుకుంటే ఎంత? ఒకవేళ బియ్యం చౌక ధరకి అమ్మేసుకుంటే, అన్ని జిల్లాలలోనూ, అన్ని మండలాల్లోనూ రైతులు కేవలం ఆ పక్క దారి పట్టిన బియ్యం వల్ల చౌక ధరకు అమ్మేసుకున్నారా?

మీరు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వలేను అని నేను ముందుగానే చెప్పాలి. కారణం నేను ఒక సామాన్య పౌరుడిని మాత్రమే. అటువంటి వివరాలు, సాక్ష్యాలు నా వద్ద ఉంటే వాటికి కారకులైన వారిని ఈ పాటికి ఒక దారికి తెచ్చేంత శాక్తిమంతుదయ్యే వాడిని.  కానీ నేను చేసిన వ్యాఖ్యల వెనుక కారణాల గురించి వివరణ ఇవ్వగలను.

పని ఆహారం పధకం క్రింద కేవలం 2001-02 లలో మూడు వేళ కోట్ల రూపాయల విలువయిన 3 మిలియన్ టన్నుల బియ్యం ఆంధ్ర ప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే కేటాయించబడింది. ది హిందూ పత్రిక కధనం ప్రకారం ఇది రెండు కోట్ల మందికి ఒక సంవత్సరం పాటు సరిపోయేంత. ఇది కొన్ని విడతలలో వచ్చింది. ఆ కాలంలో అవినీతి, బంధుప్రీతి కల నాయకుల అండదండలతో ఈ బియ్యం ప్రభుత్వ గోదాముల నుండి బయటకు, అక్కడినుండి మిల్లర్లకు, మిల్లర్ల నుండి తిరిగి fci గోదాములకు వెళ్లి చేరింది. ఈ కుంబకోణం బయటపడి, జాతీయ స్తాయిలో "ప్రసిద్ధి" చెంది, చంద్రబాబుకి తద్వారా వచ్చే మంచి పేరు చూసి ఓర్వలేక ప్రధాన మంత్రి నివేదిక కూడా కోరారు. మీకు తెలుదో లేదో. పేద వాడికి పని కల్పించి పెట్టె ఉద్దేశంతో ఆరభించిన ఈ స్కీము, స్కాము వలన కొన్నాళ్ళు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడం జరిగింది.

అంతే కాదు. మంత్రులు సుబ్బారాయుడు, కృష్ణమూర్తిలు తమ బంధువులతో కలిసి ఏ విధంగా ఈ బియ్యం అవకతవకలకు కారకులయ్యారో నివేదికలు రూపొందించిన ఆయా జిల్లా కాలేక్టర్ల మాటలను చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ఇదంతా ఆయనకీ తెలియకుండా జరిగింధంటారా?

మిలియన్ల టన్నుల లెక్కన బియ్యం రాష్ట్రానికి వచ్చి, ప్రభుత్వం పేదవాడికి పని కల్పించి ఆ బియ్యాన్ని సక్రమంగా పంచితే కరువుతో అల్లాడుతున్న మహబూబనగర్ , అనంతపూర్ జిల్లాలలో గంజి కేంద్రాలకు వెళ్లి రోజూ గంజి తాగిన లక్షల మందికి రావలసిన బియ్యం ఏమయినట్లో ? ఈ రెండు జిల్లాలోనే 200 గంజి కేంద్రాలు, రోజుకి మూడువందల మందికి చప్పున సేవ చేసాయి. ఇవేవీ ప్రభుత్వం నడిపినవి కావు. ఇంత జరుగుతుందే "ఈ కాలంలో మన రాష్ట్రంలో గంజి ఎవడండీ తగేతీ" అని మంత్రి సోమిరెడ్డి అన్నాడట. కళ్లు మూసుకు తిరిగే పిల్లి సామెత తెలుసు కదా!!


ఇక అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో రైతులు చవకగా అమ్మరా అంటే... రాష్ట్రం మొత్తం ధాన్యం ఉత్పత్తి 11-13 టన్నుల మధ్య ఉంది అనుకుందాం. ఎంత కాకపోయినా ఒక మిలియన్ టన్నుల పనికి ఆహరం బియ్యం దొడ్డిదారిన పోయింది అనుకున్నా, రాష్ట్రంలో బియ్యం లభ్యత ఎంత శాతం పెరుగుతుంది, తద్వారా మార్కెట్లో రేటు ఎంత పడిపోతుంది మీరే లేక్కవేయండి.

రైతులు చవకగా అమ్ముకోలేదు అండీ. అల అమ్ముకోవలసి వచ్చింది. వరుసగా మూడేళ్ళ కరువుతో బాధపడుతున్న రాష్ట్రంలో ధాన్యం రేటు ఎలా ఉండాలి ? (ఎంతటి కరువు అంటే, నూరు సంవత్సరాల కృష్ణా డెల్టా చరిత్రలో మొట్టమొదటి సారి కరువు పరిస్థితి ఏర్పడిందంటే ఆలోచించండి).

అటువంటి కరువు పరిస్తితులలో ధాన్యం పండించిన రైతు బస్తా కేవలం 400-450 రూపాయలకు కుప్పలు నూర్చిన వెంటనే పొలంలోనే అమ్ముకోవలసిన పరిస్థితి. దీనికి నేను నిలువెత్తు సాక్షిని. నా కళ్ళ ముందే అది జరిగింది. (అప్పుడే నేను మొదటి సారిగా చంద్రబాబు పాలన గురించి నా అభిప్రాయాలను, వాస్తవ స్థితిగతులను బేరీజు వేయడం మొదలు పెట్టింది).

ఇది మనం మాట్లాడుకుంటూ పోతే మనకి బహుసా సమయం చాలదు. ఎందుకంటే సమస్య తీవ్రత అలాటిది. ఆ తీవ్రతను పట్టించుకోని ప్రభుత్వం, అస్సలు సమస్యే లేదు అంతా బాగుంది, అభివ్రుది భేష్ అని చంకలు కొట్టుకుంది.

@ ఒక్కసారి ఆలోచించి చెప్పండి... రైతుల దుస్థితికి పూర్తిగా అతనే భాధ్యుడుని చెయ్యడం ఎంత వరకూ సబబో మీరు వివరించాలి....

భాద్యత ప్రభుత్వం తీసుకోకపోతే ఇంక ఎవరు తీసుకుంటారు. యదా రాజ తదా ప్రజా. తన నడవడిక సరిగా ఉంటే తన క్రింద వారు సక్రమంగా పని చేస్తారు. విద్యుత్ సంస్కరణలు, ఐటి రంగానికి తోడ్పాటు అందించి, మిగతాది అంత దానంతట అదే జరిగిపోతుంది అన్నట్టుగా విదేశీ పత్రికలకు ఇంటర్వియూలు ఇచ్చుకుంటూ కూర్చుంటే సరిపోతుందా. కళ్లు కింద పెట్టి కూడా చూడాలి కదా అండి.

బిల్ క్లింటన్ వస్తే తను చేయి కలుపుతూ, ఆ ఫోటోలను రాష్టమంతటా అంటించడం ఏమిటండీ. అస్సలు ఎక్కడి న్యాయం అండి అదీ. శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన. వీటి ద్వారా జరిగిన ప్రయోజనాకు, వీటి పబ్లిసిటీ కొరకు ప్రభుత్వం ఆ కాలంలో వెచ్చించిన డబ్బు, సమయం నాకు ఎంతటి పొంతన ఉందో ఒక శ్వేత పత్రం ప్రభుత్వం రెడీ చేయించాలి. అప్పుడు కాని బయట పడదు అస్సలు నిజాల పట్టీ.

పేరుకి నెంబర్వన్ ముఖ్యమంత్రి. కాని మన రాష్ట్రం ఆయన పాలనలో ఎన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండేది...రైతుల ఆత్మహత్యలలో తప్ప. నాలుగు వేల మంది రైతులు అండి. అదీ అంచనా మాత్రమే. అస్సలు సంఖ్యా ఎంతో ఎవరికీ తెలియదు. రైతులు ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యలకు పూనుకుంటుంటే, అస్సలు అలాంటిది ఏదీ జరగడం లేదు అన్నట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం ఆయనది.

ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారు అని ఎద్దేవా చేసిన మనిషి, ఇవ్వాళ ఏకంగా రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తాను అంటున్నాడు. ఏమిటీ మార్పు ? బస్తా వరికి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు. తానున్నంత కాలం కనీస మద్దతు ధర అనే మాటను అస్సలు పట్టించుకున్నడా ?

@ ఇకపోతే గ్రామాల్లో ఉపాధి కల్పన కింద కేంద్ర గణాంకాల సంస్థ నిర్వహించిన సర్వే లో 1998 నుండి 2004 వరకూ ఆంధ్ర ప్రదేష్ మొదటి స్థానంలో ఉంది...

ఇది నాకు పూర్తిగా అవగాహన లేని విషయమండి. కానీ ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్రయత్నిస్తాను. లేక మీ వద్ద లింకు ఏమైనా ఉంటే నాకు ఈమెయిలు చేయగలరు.

@ మీరింతలా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వం వహించిన పర్టీ ప్రతి పక్షాలు అంతా ఏకమయినా కూడా కేవలం .9% వోట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది అని గమనించగలరు.

ఇది కర్రెక్టు కాదు.

మీరు చెప్పిన .9% వోటు శాతం మొదటి స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి, రెండో స్థానంలో ఉన్న తెదేపా కి ఉన్న తేడా మాత్రమే. కాంగ్రెస్ (38.56%), తెరాసా (6.68%), సిపి యం (1.84%) , సి పి ఐ (1.53%) కలిస్తే వచ్చిన వోటు శాతానికి తెదేపా(37.59%) వోటు శాతానికి చాల తేడా ఉంది. క్లుప్తంగా 11% వోట్ల తేడాతో ఓడిపోయింది. ఇది భారీ ఓటమి.

పోనీ మీరు చెప్పిన కోణం నుండే చూద్దాం. తెదేపా 267 సీట్లలో పోటీ చేయగా , కాంగ్రెస్ 234 సీట్లలో మాత్రమే పోటీ చేసింది. ఆ విధంగా చూసినా కూడా మీరు చెప్పిన .9% తేడా కూడా ఒక రకంగా చాల భారీ తేడా అని గమనించగలరు.

ఇదంతా పక్కన పెడితే నేను వోటు శాతాన్ని నమ్మే వాడిని కాను. అది కేవలం సాంకేతికం మాత్రమే. ఒక్క వోటు తేడాతో గెలిచినా, గెలిచిన వాడే ఆ రోజున మొనగాడు అని నా అభిప్రాయం. ( ఒక్క వోటు తేడాతో వాజ్ పాయ్ సర్కారు కూలిన విషయం గుర్తుండే ఉంటుంది)

@ ప్రభుత్వ వ్యతిరేకత

పది శాతం వోట్ల తేడా ఉండేంత వ్యతిరేకత నేను ఇప్పటివరకు ఈ ఎన్నికలలో చూడలేదు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చడానికి అంత కన్నా మంచి కారణం లేదు అన్నట్లు అదేదో భారీగా ప్రభావితం చేసే అంసంగా మన వాళ్లు చెపుతుంటారు. ఏదో మన దేశంలో వరుసగా మూడో సారి ఏ ప్రభుత్వమూ నెగ్గనట్లు !!

@ రాజకీయులు లాగానే మీరు విమర్శలు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి.

చంద్రబాబు మీద విమర్శలు చేయాలని నాకు అంత కుతూహలంగా లేదు అంది. చంద్రబాబు స్థానంలో ఉంది, అలానే పని చేసిన వాడు ఎవడైనా నేను అలానే స్పందిస్తాను. నాలో చంద్రబాబు మీద వ్యతిరేకత మొదటినుండీ ఏమీ లేదు. చంద్రబాబు తెలివితేటల సామర్ధ్యం మీద నాకు సందేహమూ లేదు. నా అనుమానం అతని కమిట్మెంట్ మీద.

రోజు రోజూ పేపర్లలో ఇంత మంది చనిపోయారు అంత మంది చనిపోయారు అని చదివినప్పుడు ఆపడానికి ఎవడూ ఏమీ చేయడం లేదు అని పడిన అనేక రకాల భావనలు, ఆలోచనల నుండి పుట్టుకువచ్చిన గోదుని మాత్రమే నేను రాసాను.

వాస్తవానికి ఇప్పుడన్న పరిస్థుతులలో, త్వరలో ఎన్నికలు సంమేపిస్తున్న తరుణంలో నాకు ఏమనిపిస్తుంది అని చెప్పి రాయడం మొదలు పెట్టాను నా పూర్వ టాపాను. ఈ లోపే మీరు స్పందించారు కాబట్టి నా వివరణ ఇస్తున్నాను.

ఎవరో అన్నట్టు, కాంతమ్మ గారి చిన్న కోడలు మంచిది అని చెపితే, అంటే పెద్ద కోడలు చెడ్డదా అని అడిగినట్లు,
చంద్రబాబుని తిట్టుకోవదాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్ధించదానికే అనుకోరాదు.

నేను అన్నీ "issue based" గా ఆలోచిస్తాను. నాకు "political loyalty" ఏమీ లేదు. అలా నన్ను నేను ఒక పార్టీకే అన్కితమిచ్చుకుని, ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అమూల్యమయిన వోటు అనే ఆయుధాన్ని అపవిత్రం చేయలేను.

4 comments:

ఏకాంతపు దిలీప్ said...

@ అంజి బాబు గారు
హుందాగా స్పందించినందుకు నా అభినందనలు, నెనర్లు.

పని ఒత్తిడి వల్ల, సమయాభావం వల్ల నేను పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోయాను... ఒక విషయం ఏంటంటే నేను కూడా ఇష్యూ బేసెడ్ గానే ఆలోచిస్తాను.. పొలిటికల్ లోయాలిటీ బేసేడ్గా కాదు. సమయం వచ్చినప్పుడు నా విచక్షణని ఉపయోగించి, తిమ్మిని తిమ్మి అని బమ్మిని బమ్మి అనడానికి నేను వెనకాడను... ఒక చిన్న తప్పుతో పెద్ద తప్పుని పోల్చేసి రెండూ తప్పే రెండిటివైపునా ఉండను అనే పలయానవాదంలో నేను బతకను... నేను పెరుగుతున్న కొద్దీ నాకు అవగాహనా, విచక్షణా పెరుగుతుంది... అవి ప్రతీ సమయంలోను తప్పనిసరిగా ఉపయోగించే ప్రయత్నం చేస్తాను, అంతా ఒక్కటే , ఎవరిని ఏమంటే ఎవరేమంటారో అని నా భాధ్యతనుండి దూరం జరగను...

చాలా విషయాలని నేను ఇంతకుముందు పొద్దు లోని ఒక వ్యాసంలో చర్చించాను... ఇందాకే ఇంకోక పోస్ట్ వేసాను అక్కడ... ఈ లంకె గమనించగలరు...

http://poddu.net/?p=583&cpage=1#comment-3456

మీరు చూసేసరికి పొద్దులో నా వ్యాఖ్య అంగీకారం పొంది ఉండకపోవచ్చు...

ఏకాంతపు దిలీప్ said...

@ అంజి బాబు గారు

ఇంకా నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది... సమయం దొరికినప్పుడు మరలా వస్తాను.

Anonymous said...

దిలీప్ గారు,

మీ వ్యాఖ్యకు అభినందనలు. మీరు చెప్పిన లకేను సందర్శించాను. చాల మంచి చర్చ జరుగుతుంది అక్కడ.

ఎంప్లాయిమెంట్ వృద్ధి గురించి మీరు అక్కడ పెట్టిన లింకుని పరిశీలించాను.కొత్త విషయం తెలుసుకున్నాను.

నేను కూడా అక్కడి చర్చలో పాలుపంచుకోవాలని ఉంది. కాని సమయాభావం చేతులు కట్టేస్తుంది. త్వరలో మిమ్మలను జాయిన్ అవుతాను. ఆహ్లాదకరమైన చర్చలు, పరస్పర విజ్ఞానాన్ని పెంచే అటువంటి మంచి సంభాషణలకు నేను ఎప్పుడూ సై అంటే సై !!

త్వరలో కలుద్దాం.

Anonymous said...

దిలీప్ గారు,

మరొక విషయం. ఒకటి రెండు విషయాలు చెపుతూ కొంచెం వ్యంగ్యం ప్రదర్శించడానికి ప్రయత్నించాను. నాకు అది ఇప్పుడు తప్పుగా అనిపిస్తుంది. అది కాస్త అతి తెలివి బయట పడిన సమయమే కానీ, అగౌరవమ్ గా అన్నది కాదు. గమనించగలరు.

మరలా కలుద్దాం. సెలవు.
అంజి బాబు

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge